Uttam Kumar Reddy: 2005లో కేసు నమోదైతే.. 13 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు: ఉత్తమ్ కుమార్

  • పాస్ పోర్ట్ కేసులో కేసీఆర్, హరీష్ రావులే నిందితులు
  • తెలంగాణను నాలుగేళ్లుగా కేసీఆర్ కుటుంబం పీడిస్తోంది
  • కొందరు పోలీసు అధికారులు కేసీఆర్ కు తొత్తులుగా పని చేస్తున్నారు

కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగ్గారెడ్డిపై 2005లో కేసు నమోదైందని... 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అక్రమ పాస్ పోర్టు కేసులో జగ్గారెడ్డి దోషి కాదని... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులే నిందితులని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

 మొత్తం తెలంగాణను నలుగురు సభ్యుల కేసీఆర్ కుటుంబం నాలుగేళ్లుగా పీడిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ఈరోజు గాంధీభవన్ లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు. పార్టీలో చేరిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.

కొంత మంది పోలీసు అధికారులు కేసీఆర్ కు తొత్తులుగా పని చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ఎవర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో 25 వేల గ్రామాలలో ఇంటింటికీ నీరు ఇచ్చామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే అప్పులు తెచ్చి, ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష్యం బంగారు తెలంగాణ కాదని, బంగారు కుటుంబమని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ను మించినవారు మరెవరూ లేరని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ చెప్పారు. 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళా సంఘానికి రూ. లక్ష గ్రాంట్ గా ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని తెలిపారు. 58 ఏళ్లకే వృద్ధులకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి 7 కిలోల సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News