madras highcourt: జయలలిత వారసుల వివరాలు ఇవ్వండి: మద్రాస్ హైకోర్టు ఆదేశం
- ఆదాయ పన్ను శాఖను కోరిన మద్రాస్ హైకోర్టు
- ఆస్తిపన్ను వ్యాజ్యం విచారణ సందర్భంగా ఆదేశం
- ఇరవై ఏళ్ల క్రితం నుంచి కోర్టులో నడుస్తున్న కేసు
మద్రాస్ హైకోర్టులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత వారసుల ప్రస్తావన వచ్చింది. ఆమెకు ఎవరైనా వారసులు ఉన్నారా? అందుకు సంబంధించి ఆమె ఏమైనా వీలునామా రాశారా? ఆ వివరాలు ఉంటే మాకు సమర్పించండి’ అంటూ మద్రాస్ హైకోర్టు సోమవారం ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. జయలలిత ఆస్తి పన్ను అంచనాలకు సంబంధించి 1997 నుంచి నడుస్తున్న వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ హులువాది జి.రమేష్, జస్టిస్ కె.కళ్యాణ్‌సుందరం ఈ ఆదేశాలు జారీచేశారు.
2000 మార్చి నాటికి జయలలిత ఆస్తుల విలువ రూ.4.67 కోట్లని మొదట ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. నిఘా, అవినీతి నిరోధక విభాగం పరిశీలన తర్వాత మరికొన్నింటిని చేర్చారు. దీనిపై అప్పట్లో జయలలిత అప్పీల్ చేయగా విచారించిన ట్రైబ్యునల్ అదనంగా చేర్చిన ఆస్తుల అంచనాను కొట్టేసింది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమంటూ ఆదాయ పన్నుశాఖ హైకోర్టులో సవాల్ చేయడంతో ప్రస్తుతం వ్యాజ్యం నడుస్తోంది.