renuka chowdary: మోదీపై మరోసారి విమర్శలు గుప్పించిన రేణుకా చౌదరి
- పెట్రో ధరల పెరుగుదలకు మోదీ అనుభవరాహిత్యమే కారణం
- నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు
- మోదీని కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు నిలదీయడం లేదు?
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మరోసారి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు మోదీ అనుభవరాహిత్యమే కారణమని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని అన్నారు. 'నేనే రాజు, నేనే మంత్రి' అనే విధంగా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని... చెమటనే డీజిల్ గా మార్చుకుని ట్రాక్టర్ నడుపుతున్నారని మండిపడ్డారు.
ఎప్పుడంటే అప్పుడు ఢిల్లీకి పరిగెత్తే కేసీఆర్, కేటీఆర్ లు... పెట్రో ధరల పెరుగుదలపై ఎందుకు నిలదీయడం లేదని రేణుక ప్రశ్నించారు. అనుభవం లేని మోదీలాంటి వారికి అధికారం అప్పగిస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... ఈ మేరకు వ్యాఖ్యానించారు.