Telangana: పదమూడేళ్ల బాలికపై నలుగురు బాలుర లైంగిక దాడి!
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- బాధితురాలి నానమ్మ ఫిర్యాదు
- పోలీసుల అదుపులో నిందితులు
పదమూడేళ్ల బాలికపై నలుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలక్‌నుమా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపిన వివరాల మేరకు... సుల్తాన్‌సాహి ప్రాంతానికి చెందిన బాధిత బాలిక తల్లిదండ్రుల మధ్య విభేదాలున్నాయి. ఈ కారణంగా ఆమె నానమ్మ వద్ద ఉంటోంది. అప్పుడప్పుడూ అంబికానగర్ ప్రాంతంలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చి వెళ్తుంటుంది.
ఈ క్రమంలో గౌలిపురా మేకల మండీ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురతో ఈమెకు పరిచయమయింది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన ఈ ఇద్దరు బాలురు తమ స్నేహితులు మరో ఇద్దరితో కలిసి బాధిత బాలికను మేకల మండీ మైదానానికి తీసుకువెళ్లారు. అక్కడ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బాధిత బాలిక తన నానమ్మకు చెప్పడంతో ఆమె మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికకు వైద్య పరీక్షలు చేయించి నింబోలి అడ్డాలోని ఆశ్రమానికి తరలించారు. శనివారం నిందితులైన నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు.