Telangana: ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు.. దయచేసి ఎవరూ ఇటు రావొద్దు: ఆకట్టుకుంటున్న జనగామ వాసి వాల్పెయింటింగ్!
- గ్రామాల్లో మొదలైన ప్రచార సందడి
- తన ఇంటికి రావద్దంటూ గోడపై రాయించిన వెంకటస్వామి
- ఆలోచింపజేస్తున్న అంబేద్కర్ సూక్తి
తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకుంది. టీఆర్ఎస్ అప్పుడే ప్రజల్లోకి వెళ్లిపోయి ప్రచారాన్ని మొదలుపెట్టింది. కేసీఆర్ తొలి సభ కూడా పెట్టేసి జోరుమీదున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు కూడా సభలు, సమావేశాల నిర్వహణ కోసం రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈసీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక నాయకుల కోలాహలం మొదలవుతుంది. ఓటర్లు దేవుళ్లంటూ ఎక్కేమెట్టూ, దిగేమెట్టుతో బిజీగా మారిపోతారు. ప్రలోభాలు మొదలవుతాయి.
ఇవన్నీ ముందే ఊహించాడు జనగామ జిల్లా కోమళ్లకు చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి. అందుకే, తన ఇంటికి ఎవరూ రావద్దని, తాము అమ్ముడుపోబోమంటూ ఇంటి గోడపై రాయించాడు. అందరినీ ఆకట్టుకుంటున్న ఆ గోడపై ‘‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉండగా కింద ఆయన పేరు ఉంది. ఆ తర్వాత.. ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు- ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. ఓడిపోయి(అమ్ముడుపోయి) బానిసలవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది’ అన్న అంబేద్కర్ సూక్తి ఉంది. తాటికాయంత అక్షరాలతో రాసిన ఈ పెయింటింగ్ చూశాక కూడా నాయకులు ఆయన ఇంట్లోకి వెళ్లే సాహసం చేస్తారంటారా? ఏమో.. వేచి చూద్దాం!