Bald Head: బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తున్న విశాఖ కేజీహెచ్ వైద్యులు.. అద్భుత ఫలితాలు!

  • విశాఖ కేజీహెచ్‌లో ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్స
  • చికిత్స పూర్తిగా ఉచితం
  • జుట్టు రాలిన చోటే మళ్లీ కొత్త వెంట్రుకలు

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేయించుకుని విసిగిపోయారా? బట్టతలపై జుట్టు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారా? అయితే.. మీకో శుభవార్త. లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా పరిష్కారం కాని సమస్యను రూపాయి కూడా ఖర్చు లేకుండా పరిష్కరిస్తోంది విశాఖపట్టణంలోని కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లోని చర్మ వ్యాధుల విభాగం.

ఈవేళ యువతను ఏదైనా సమస్య వేధిస్తోందీ అంటే.. అది కచ్చితంగా బట్ట తలే. పెళ్లికాకుండానే మైదానంలా తయారవుతున్న తలను చూస్తూ చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆత్మన్యూనతకు గురువుతున్న కొందరు తమకిక పెళ్లికాదేమోని భయపడుతున్నారు. తిరిగి జుట్టును మొలిపించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వారి కోసం కేజీహెచ్ అత్యంత నాణ్యమైన చికిత్సను అందిస్తూ విజయాలు సాధిస్తోంది.

 కేజీహెచ్ అందిస్తున్న ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్స అద్భుత ఫలితాలు అందిస్తోంది. ఈ చికిత్సతో వెంట్రుకలు రాలిన చోటే మళ్లీ మొలిపిస్తున్నారు. బయట ఈ చికిత్సకు లక్షల్లో వసూలు చేస్తుండగా, కేజీహెచ్‌లో ఇది పూర్తిగా ఉచితం. నెలకు 60 మందికి చికిత్స చేస్తున్నారు. బట్టతలతో బాధపడుతున్న వారి నుంచి రక్తాన్ని సేకరించి సెంట్రిఫ్యూజ్‌ అనే యంత్రం సాయంతో పీఆర్పీని విడదీస్తారు. దానిని జుట్టు రాలిపోయిన చోట ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా కొన్ని వారాల తర్వాత వెంట్రుకలు నెమ్మదిగా బయటకు వస్తాయి. సమస్య తీవ్రతను బట్టి పది నుంచి 20 ఇంజెక్షన్ల వరకు చేస్తారు. దీంతోపాటు కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది.

ఈ వైద్యం అందరికీ ఫలితం ఇవ్వాలనేం లేదని కేజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. చికిత్సకు ముందే వ్యక్తికి వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. మధుమేహం, హార్మోన్లు, కొవ్వు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి పరీక్షలు నిర్వహించాకే చికిత్స మొదలుపెడతారు. నిజానికి ఈ చికిత్సలో చేసే ఒక్కో ఇంజెక్షన్‌కు బయట రూ.2 వేలు వసూలు చేస్తారని, మొత్తం 5 నుంచి 15 సిట్టింగ్‌లు అవసరం అవుతుందని, ఇక్కడ పూర్తిగా ఉచితమని కేజీహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ గురుప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News