kcr: మీ ఆశీర్వాదంతో యుద్ధానికి బయల్దేరుతున్నా: కేసీఆర్
- తెలంగాణను అగ్ర స్థానంలో నిలపడమే నా లక్ష్యం
- మరణం అంచుల వరకు వెళ్లి, తెలంగాణను సాధించా
- ఢిల్లీకి గులాంల మాదిరి కాకుండా.. తెలంగాణకు గులాబీల్లా ఉందాం
తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా తాను సాగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి, మరణం అంచుల వరకు వెళ్లి తెలంగాణను సాధించానని ఆయన తెలిపారు. ఉద్యమం సమయంలో చిత్తశుద్ధితో రాజీనామాలు చేసింది టీఆర్ఎస్ నేతలే అని చెప్పారు. తెలంగాణను ఢిల్లీ బాసుల చేతుల్లో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారని... మన రాజకీయ నిర్ణయం మన చేతుల్లోనే ఉండాలని తాము చెబుతున్నామని తెలిపారు. ఢిల్లీకి గులాంల మాదిరి కాకుండా, తెలంగాణకు గులాబీల్లా ఉందామని చెప్పారు. తెలంగాణ స్వతంత్రంగా ఉండాలని, సామంతులుగా కాదని అన్నారు. హుస్నాబాద్ సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ ప్రజల ఆశీస్సులతో తాను యుద్ధానికి బయల్దేరుతున్నానని చెప్పారు.
తెలంగాణను మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ తెలిపారు. కోటి ఎకరాలకు సాగు నీటిని అందించడమే తన లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తన ఆకాంక్ష అని తెలిపారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలకు భరోసా కలిగిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎన్నో ఆరోపణలు చేసిందని, కానీ, ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.