Madhya Pradesh: రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. ఫారెస్ట్ అధికారిని ట్రాక్టర్ తో తొక్కించి హత్య!
- మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లాలో ఘటన
- ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న కుష్వాహా
- ట్రాక్టర్ తో తొక్కించి కిరాతకంగా హత్యచేసిన దుండగులు
మధ్యప్రదేశ్ లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవడానికి యత్నించిన ఫారెస్ట్ అధికారిని అత్యంత కిరాతకంగా ట్రాక్టర్ తో తొక్కించి హత్యచేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో చోటుచేసుకుంది.
మొరేనా జిల్లాలోని ఘొర్నా ఫారెస్ట్ రేంజ్ లో డిప్యూటీ రేంజర్ గా సుబేందర్ సింగ్ కుష్వాహా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నలుగురు సిబ్బందితో కలసి ఆయన తనిఖీలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అందుకునేందుకు యత్నించగా, దుండగులు ట్రాక్టర్ తో ఆయన్ను తొక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. 2012లో అక్రమ మైనింగ్ పై తనిఖీలకు వెళ్లిన యువ ఐఏఎస్ అధికారి నరేంద్ర కుమార్ కూడా ఇక్కడే శవమై తేలారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం మైనింగ్ మాఫియాకు స్వర్గధామంగా మారింది. అప్పట్లో నరేంద్ర కుమార్ ను కూడా అక్రమార్కులు ఇదే తరహాలో ట్రాక్టర్ తో తొక్కించి హత్యచేశారు. కాగా, డిప్యూటీ రేంజర్ సుబేందర్ సింగ్ హత్యకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించారు.