aadhaar: ఆధార్ లేకున్నా స్కూళ్లలో అడ్మిషన్ ఇవ్వాల్సిందే.. స్పష్టం చేసిన యూఐడీఏఐ!
- అడ్మిషన్ నిరాకరించడం చట్టవిరుద్ధం
- ప్రత్యామ్నాయ పత్రాలను తీసుకోండి
- రాష్ట్రాల సీఎస్ లకు యూఐడీఏఐ సర్క్యులర్
ఆధార్ కార్డు లేని కారణంగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు నిరాకరించరాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది. ఇలాంటి కారణంతో అడ్మిషన్లు నిరాకరించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు బదులుగా స్థానికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆధార్ కార్డుల కోసం ఎన్ రోల్ మెంట్ చేయించాలని సూచించింది.
ఇటీవలి కాలంలో కొన్ని పాఠశాలలు ఆధార్ లేదన్న వంకతో విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని యూఐడీఏఐ తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు యూఐడీఏఐ సర్క్యులర్ జారీచేసింది. ఆధార్ కోసం పాఠశాలలు ఒత్తిడి చేయడంతో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. విద్యార్థుల వద్ద ఆధార్ లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.