Chandrababu: బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధమైంది.. చిత్తుచిత్తుగా ఓడించండి: చంద్రబాబు
- రాష్ట్రంలోకి దొడ్డి దారిన ప్రవేశించేందుకు బీజేపీ యత్నిస్తోంది
- వైసీపీ, జనసేనలు దొడ్డి దారులు
- బీజేపీ మోసం చేయకపోతే... రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధించేది
రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ సిద్ధమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోకి దొడ్డి దారిన ప్రవేశించేందుకు బీజేపీ యత్నిస్తోందని... వైసీపీ, జనసేన పార్టీలే ఆ దొడ్డి దారులు అని అన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే... ఏకంగా 126 మంది ఎంపీలు మద్దతు ప్రకటించారని చెప్పారు.
యుద్ధ క్షేత్రం నుంచి పారిపోయిన వైసీపీ... ఒక వెన్నెముక లేని పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న టీడీపీకి అండగా నిలవాలని... రాష్ట్రాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏపీకి ఒక చారిత్రక అవసరమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అక్కడక్కడా చిన్నచిన్న తప్పులు జరగడం సహజమేనని... స్థానిక నాయకులు పని చేయలేదనో, అధికారులు పని చేయలేదనో ఆ కోపాన్ని ప్రభుత్వంపై చూపిస్తే... మనమే నష్టపోతామని చంద్రబాబు చెప్పారు. మన కులంవాడనో, మన మతంవాడనో ఓట్లు వేయడం తప్పుడు నిర్ణయమని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని... అలాంటి వాటికి తాను భయపడనని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం మోసం చేయకపోతే, ఏపీ మరింత అభివృద్ధిని సాధించేదని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ. 2,800 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రాజెక్టును కేంద్రానికి వదలకుండా, ముందుకు సాగుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయని దుయ్యబట్టారు. పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రూపాయి విలువ దారుణంగా పతనమైందని... ఇదేనా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ? అంటూ మండిపడ్డారు.