Telangana: తెలంగాణలో ఏం జరుగుతోంది?... నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు!
- తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
- ముందస్తు వస్తే పాటించాల్సిన వ్యూహంపై చర్చలు
- అసెంబ్లీ రద్దయితే తెలంగాణలో చంద్రబాబు విస్తృత పర్యటన
తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్న వేళ, పొరుగు రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు వస్తే, తెలుగుదేశం పార్టీ ఏ విధమైన వ్యూహం పాటించాలన్న విషయమై ఆయన ఇప్పటికే టీటీడీపీ నేతలతో సమాలోచనలు ప్రారంభించారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు కేసీఆర్ క్యాబినెట్ ప్రకటించిన తరువాత, తెలంగాణలో విస్తృతంగా పర్యటించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో టీడీపీకి నేతలు లేకపోయినా, క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉందని నమ్ముతున్న చంద్రబాబు, వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు తానే స్వయంగా కదలాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో బరిలోకి దిగుదామని నేతలు చెబుతున్న వేళ, అటువంటి పరిస్థితి వస్తే, ఏపీలో ఏం చేయాలన్నదానిపైనా చంద్రబాబు తన సహచరులతో ఇప్పటికే చర్చించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎటువంటి వ్యూహాన్నైనా తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్టు అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే తీసుకోవాలని, అప్పటివరకూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తుండాలని ఎల్.రమణ తదితర తెలంగాణ నేతలను చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.