tajinderpal singh toor: స్వర్ణ పతకంతో ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన కొడుకు.. చూడకుండానే మృతి చెందిన తండ్రి!
- రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న తాజిందర్ తండ్రి
- కొడుకు స్వర్ణం గెలిస్తే చూడాలనుకున్న తండ్రి
- గెలిచినా చూడకుండానే మృతి
ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని తండ్రికి గర్వంగా చూపించాలనుకున్న ఆ కుమారుడికి పెను విషాదమే మిగిలింది. విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే దుర్వార్త వినిపించింది. తన తండ్రి ఇక లేడన్న విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పంజాబ్‌కు చెందిన తాజిందర్ పాల్‌సింగ్ తూర్ షాట్‌పుట్‌లో బంగారు పతకాన్ని అందుకుని జాతీయ జెండాను రెపరెపలాడించాడు. తాను సాధించిన పతకాన్ని తండ్రి కరమ్ సింగ్‌కు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అన్న ఆశతో భారత్‌కు బయలుదేరాడు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే తండ్రి పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసింది.
దీంతో కన్నీరు పెట్టుకుంటూనే రోడ్డు మార్గంలో పంజాబ్‌లోని స్వగ్రామం మోగాకు బయలుదేరాడు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతాడనగా తండ్రి చనిపోయిన వార్త తెలిసింది. కరమ్ సింగ్ రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. తాను బంగారు పతకం సాధిస్తే చూడాలనేది తండ్రి కోరిక అని, తాను ఇప్పుడు దానితో వచ్చినా ఆయన చూడలేకపోయారని తాజిందర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.