Japan: జపాన్ ను చుట్టుముట్టిన భయంకర టైపూన్ 'జెబీ'... గంటకు 216 కి.మీ. వేగంతో గాలులు!
- గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత భయంకర తుపాను
- 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశం
- యూనివర్సల్ స్టూడియో మూసివేత
- నగోయా, ఒసాకా విమానాశ్రయాల మూసివేత
జపాన్ ను భయంకర టైపూన్ చుట్టుముట్టింది. గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత భయంకరమైన టైపూన్ గా దీన్ని ప్రభుత్వం అభివర్ణించింది. గంటకు 216 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తీర ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుండగా, 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.
దీనికి 'జెబీ' అని పేరు పెట్టగా, దీని ప్రభావం జపాన్ ద్వీపమైన శికోకుపై అత్యధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శికోకులో ఎవరూ ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. పోర్ట్ సిటీగా ఉన్న కోబెను ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అక్కడ ఒక్కరు కూడా ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
జెబీ దెబ్బకు ప్రతిష్ఠాత్మక యూనివర్సల్ స్టూడియోను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. స్టూడియోను తిరిగి ఎప్పుడు తెరుస్తామన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. నగోయా, ఒసాకా విమానాశ్రయాలను మూసివేసిన అధికారులు, ఈ నగరాల నుంచి తిరిగే అన్ని విమాన సర్వీసులనూ రద్దు చేశారు.