Laloo: కుక్కలు మొరుగుతున్నాయి... దోమలు కుడుతున్నాయి.. వార్డు మార్చండి బాబూ!: లాలూ డిమాండ్
- ప్రస్తుతం రాంచీ రిమ్స్ లో లాలూ
- గది పక్కనే టాయిలెట్ పైప్, పోస్టుమార్టం గది
- తనను మరో చోటకు మార్చాలని డిమాండ్
పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు పాలై, ప్రస్తుతం జార్ఖండ్ లోని రాంచీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ, తన వార్డును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కలు అరుస్తున్నాయని, ఇక్కడ పరిశుభ్ర వాతావరణం లేదని, దోమలు కుడుతున్నాయని ఆరోపిస్తున్న ఆయన, తనను మరో గదికి మార్చాలని కోరారు.
ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ఆర్జేడీ జాతీయ కార్యదర్శి భోలా యాదవ్, ఈ మేరకు రిమ్స్ (రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ కు వినతిపత్రాన్ని అందించినట్టు తెలిపారు. లాలూ ఉన్న గదికి ఓ టాయిలెట్ పైపు దగ్గరగా ఉందని, దాన్నుంచి దుర్వాసన వస్తోందని, ఇప్పటికే ఇన్ఫెక్షన్ తో ఇబ్బందులు పడుతున్న తమ నేత ఆరోగ్యం, ఈ దుర్గంధం కారణంగా మరింత దిగజారవచ్చన్న ఆందోళన తమకుందని చెప్పారు. పక్కనే పోస్టుమార్టం గది ఉండటంతో ఎన్నో వీధి కుక్కలు అక్కడ చేరి, అరుస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని అన్నారు. కాగా, గత సంవత్సరం డిసెంబర్ నుంచి లాలూ జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.