Chandrababu: రూపాయి విలువ పతనమవుతోంది.. పెట్రోల్ ధర రూ.100 అవుతుందేమో!: సీఎం చంద్రబాబునాయుడు
- రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది
- డాలరుతో రూపాయి మారకం విలువ వందవుతుందేమో
- పెద్దనోట్ల రద్దు ద్వారా ఏం సాధించారు?
ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.86కు చేరిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నీటి ప్రాజెక్టుల అంశంపై ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. డాలరుతో రూపాయి మారకం వంద రూపాయలు అవుతుందేమో! పెట్రోల్ ధర కూడా రూ.100కు చేరుతుందేమో, ఎక్కడికి పోతున్నారో అర్థం కావడం లేదు’ అని కేంద్రాన్ని విమర్శించారు. 'పెద్దనోట్ల రద్దు ద్వారా ఏం సాధించారు? అందరినీ ఇబ్బంది పెట్టడం తప్ప!' అన్నారు చంద్రబాబు. ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు లేవని, పరిస్థితి ఘోరంగా ఉందని, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం ఆర్థిక క్రమశిక్షణ కాదని, అది చేతకానితనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీఏ పాలనలో వృద్ధి ఆగిపోయిందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. మన బ్యాంకుల్లో ఎన్పీల సంఖ్య పెరిగాయని, స్విస్ బ్యాంకులలో అకౌంట్ల సంఖ్య పెరిగాయని విమర్శించిన చంద్రబాబు, జగన్ లాంటి అవినీతిపరులను పక్కన పెట్టుకున్న మోదీ, నీతి, నిజాయతీ గురించి మాట్లాడే అర్హతను కోల్పోయారని అన్నారు.