Chandrababu: చంద్రబాబుది నోరా? అబద్ధాల ఫ్యాక్టరీనా?: వైఎస్ జగన్
- గుంటూరు సభలో యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు
- అమాయక ముస్లింలను పోలీసులు నిర్బంధించారు
- వారిని విడిపించేందుకెళ్లిన మా వాళ్లనూ అరెస్టు చేశారు
ఇటీవల గుంటూరులో జరిగిన ‘నారా హమారా - టీడీపీ హమారా’ ముస్లిం మైనార్టీల బహిరంగ సభలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు యత్నించారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. విశాఖ జిల్లాలోని కె.కోటపాడులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టి పారేశారు.
గుంటూరు సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే.. అమాయకులైన ఆ యువకులను పోలీసులు నిర్బంధించారని, ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పుతూ వారిని కొట్టి 30 గంటలు హింసించారని ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసిన ముస్లిం యువకులను విడిపించడానికి వెళ్లిన తమ పార్టీ నాయకులను కూడా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకులపై తప్పుడు కేసులు పెట్టడం ధర్మమేనా? అని జగన్ ప్రశ్నించారు. తుని ఘటనలో చంద్రబాబే రైలు తగులబెట్టించి, ఆ నెపం వైసీపీపై నెట్టారని, ‘చంద్రబాబుది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని బాబుపై జగన్ దుమ్మెత్తిపోశారు.