kcr: కేసీఆర్ ప్రసంగం పాత చింతకాయపచ్చడిలా ఉంది: రేవంత్ రెడ్డి
- కేసీఆర్ మాటల్లో, చేతల్లో వాడీవేడీ తగ్గింది
- ‘ముందస్తు’ నిర్ణయం వాయిదా వేసుకున్నట్టుంది!
- మేనిఫెస్టోలో హామీలు చాలా వరకు నెరవేరలేదు
టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ముగిసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ నాయకుల విమర్శలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రసంగం పాత చింతకాయపచ్చడిలా ఉందని, కేసీఆర్ మాటల్లో, చేతల్లో వాడీవేడీ తగ్గిందని అన్నారు. ఆయన వాలకం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల నిర్ణయం వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తోందని, మళ్లీ కేసీఆరే సీఎం కావాలన్న అవసరం ఉన్నట్టు జనాన్ని మభ్యపెట్టారని అన్నారు.
ఈ సభలో ఏ అంశంపైనా ప్రజలకు కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదని, నాడు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దివాల తీసిందని, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీలు చాలా వరకు నెరవేరలేదని విమర్శించారు. ఏదైనా లాభం వచ్చిందంటే టీఆర్ఎస్ చేసిందని, నష్టం వస్తే కాంగ్రెస్ పార్టీ పాపమేనని చెప్పడం కేసీఆర్ కు అలవాటైపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.