KTR: రేపటి నుంచి కొత్త నిర్మాణాలన్నింటికి 'రెరా' నిబంధనలు తప్పనిసరి: మంత్రి కేటీఆర్
- రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ ఆఫీసు ప్రారంభం
- ‘రియల్’ ఏజెంట్ల పేర్లు రెరా కింద నమోదు తప్పనిసరి
- రెరా అనుమతులు లేకపోతే చట్టపరమైన చర్యలు
తెలంగాణలో రేపటి నుంచి కొత్త నిర్మాణాలన్నింటికి తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ (రెరా) నిబంధనలను పాటించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్, ఏసీ గార్డ్స్ లోని డీటీసీపీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెరా కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ మొక్కలు నాటారు.
అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ, 1-1-2017 తర్వాత తెలంగాణలో ప్రారంభించిన లే-అవుట్లు, నిర్మాణాలకు రెరా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించి లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లు కూడా తమ పేర్లను రెరా కింద నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో లావాదేవీలు నిర్వహించేందుకు వీలుండదని స్పష్టం చేశారు.
సరైన అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే వారిపై రెరా కింద చట్టపరమైన చర్యలను తీసుకుంటారని, దీని పరిధిలోకి రాని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదని కేటీఆర్ ఆదేశించారు.