KTR: నేను బచ్చాగాడిని అయితే.. రాహుల్ గాంధీ ఎవరు?: కేటీఆర్

  • నేను 42 ఏళ్ల బచ్చా అయితే.. రాహుల్ 45 ఏళ్ల బచ్చా
  • వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు
  • కుటుంబ పాలన ఎవరిదో మీరే చెప్పండి

తనను బచ్చా అనే వాళ్లు... ముందు వాళ్ల నాయకుడు రాహుల్ గాంధీ గురించి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని తెలిపారు. తాతలు, తండ్రుల పేరు చెప్పుకుని తాను ఈ స్థాయికి రాలేదని... ప్రజల మద్దతుతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. రాహుల్ గాంధీ తనకన్నా మూడేళ్లు పెద్దవారని... మరి తాను బచ్చాగాడిని అయితే, ఆయనేంటి? అని ప్రశ్నించారు. తాను 42 ఏళ్ల బచ్చాగాడిని అయితే... ఆయన 45 ఏళ్ల బచ్చాగాడని ఎద్దేవా చేశారు.

'మా నాయన వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాననే అనుకుందాం. మరి ఆయన పరిస్థితి ఏంది? నాన్నకు ముత్తాత మోతీలాల్ నెహ్రూ, రాహుల్ కు ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్ గాంధీ, అమ్మ సోనియాగాంధీ... ఇంతమంది ఉన్నారు. కాంగ్రెసోళ్లంతా వచ్చి మాది కుటుంబ పాలన అంటారు. కుటుంబపాలన ఎవరిదో మీరే చెప్పండి' అని ప్రశ్నించారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నిన్న తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News