DMK: డీఎంకే రథ సారథిగా స్టాలిన్.. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు!
- అన్నకు చెక్ పెట్టేందుకు స్టాలిన్ వ్యూహం
- శాంతి ర్యాలీకి ముందే అధ్యక్షుడిగా ఎన్నిక
- కోశాధికారిగా దురై మురుగన్ కు ఛాన్స్
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి మరణం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. తాజాగా డీఎంకే ఉపాధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ రోజు పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవికి మంగళవారం ఎన్నిక జరగనుంది. కాగా, నామినేషన్ దాఖలుకు ముందు స్టాలిన్ తన తల్లి దయాళు అమ్మాళ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కోశాధికారి పదవికి సీనియర్ నేత దురై మురుగన్ నామినేషన్ దాఖలు చేశారు.
దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న కరుణ ఇటీవల కన్ను మూసిన సంగతి తెలిసిందే. తన రాజకీయ వారసుడు స్టాలినే అని కరుణానిధి గతంలోనే ప్రకటించారు. ఆయన మాట వినకపోవడంతో పెద్ద కుమారుడు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అంతా కలసిపోయారు. తాజాగా కరుణ మరణం నేపథ్యంలో మళ్లీ బయటికొచ్చిన అళగిరి నిజమైన డీఎంకే కార్యకర్తలు తనవైపే ఉన్నారని వ్యాఖ్యానించారు.
స్టాలిన్ డీఎంకేకు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయినప్పటికీ.. అతను తన పనిని సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. అంతేకాకుండా వచ్చే నెల 5న చెన్నైలో శాంతి ర్యాలీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం అధ్యక్ష ఎన్నికలకు డీఎంకే పార్టీ నోటిఫికేషన్ జారీచేసింది.