Rice: కేరళలో ఎక్కడ చూసినా మన బియ్యమే... సాయం మరువలేమంటున్న మలయాళీలు!
- ప్రకృతి విలయం తరువాత కళావిహీనమైన కేరళ
- ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రం
- తెలుగు రాష్ట్రాల నుంచి 800 టన్నుల బియ్యం
ప్రకృతి సృష్టించిన విలయం తరువాత కళావిహీనమైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మామూలుగా కేరళ వాసులు నిత్యమూ ఆహారంలో దొడ్డుబియ్యాన్ని అత్యధికంగా తింటారు. వరదల కారణంగా, 13 జిల్లాల్లోని ఇళ్లల్లో ఉన్న బియ్యం బస్తాలతో పాటు, గిడ్డంగుల్లోని బియ్యం సైతం పాడైపోయాయి. ఇప్పుడు కేరళలో ఎక్కడ చూసినా, ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిన సన్నబియ్యం కనిపిస్తున్నాయి.
తొలి విడతలో అనంతపురం, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి సుమారు 800 టన్నుల బియ్యం కేరళకు చేరగా, ఆ బియ్యంతో వెళ్లిన లారీలు ఇప్పుడు ప్రతి జిల్లాలో కనిపిస్తున్నాయి. తమ కష్టకాలంలో ఇంత భారీ మొత్తంలో బియ్యాన్ని పంపి ఆదుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు మలయాళీలు కృతజ్ఞతలు చెబుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
విద్యుత్ ను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సిబ్బంది కూడా వెళ్లి సేవలందిస్తున్నారు. సుమారు 120 మంది ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి విద్యుత్ ఉద్యోగులు కేరళకు వెళ్లి అక్కడ విద్యుత్ పనులను చూస్తున్నారు. బియ్యంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువుల ప్యాకెట్లు సైతం కేరళకు చేరుకున్నాయి.