Narendra Modi: ముందస్తుకు ఓకే చెప్పించుకున్న కేసీఆర్... 2న మరింత స్పష్టత!

  • విజయవంతమైన కేసీఆర్ ఢిల్లీ పర్యటన
  • జోనల్ వ్యవస్థకు, ముందస్తుకు అంగీకరించిన మోదీ
  • 2వ తేదీన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. జోనల్ వ్యవస్థకు, ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ 'ఓకే' చెప్పించుకుని వచ్చినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో నిన్న సుదీర్ఘ చర్చలు జరిపిన ఆయన, తెలంగాణలో ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయమై 2వ తేదీన తలపెట్టిన 'ప్రగతి నివేదన సభ'లో కేసీఆర్ మరింత స్పష్టతనిస్తారని తెలుస్తోంది.

నిన్న సుమారు 20 నిమిషాల పాటు మోదీతో కేసీఆర్ ఏకాంతంగా సమావేశం కాగా, ముందస్తు ఎన్నికలపైన, పరస్పర ప్రయోజనాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఆపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆయన, మరో వారంలోగా నియోజకవర్గాలకు ఇచ్చిన నిధులు ఖర్చు చేయాలని, సంక్షేమ చెక్కులు ప్రజలకు పంచేయాలని సీఎం సంకేతాలు ఇచ్చారు. 10 వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఈలోగా జోనల్‌ వ్యవస్థకు ఆమోదం పలికినట్టు ఉత్తర్వులు వస్తాయని, 'ప్రగతి నివేదన సభ'లో కొత్త ఉద్యోగాల ప్రకటనతో పాటు, ఎమ్మెల్యేలుగా నిలబడే కొందరు అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

కాగా, తెలంగాణలో కేసీఆర్ మరోసారి ఘన విజయం సాధిస్తే, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనిష్ఠస్థాయికి పడిపోతుందని, అది తమకు అనుకూలించే అంశమని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ కు ప్రాథమికంగా అనుమతులు ఇచ్చారని, జోనల్ వ్యవస్థకు కూడా ఆమోదం పలికారని సమాచారం. దీనికితోడు తెలంగాణలో ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ప్రజానాడి ఎలా ఉంటుందన్న విషయమై ఓ అవగాహన కూడా వస్తుందన్న ఆలోచనలో ఉన్న మోదీ, కేసీఆర్ ఆలోచనకు సరేనన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News