Telangana: అసభ్య చిత్రాలతో మహిళా లెక్చరర్‌ను వేధించిన బీటెక్ విద్యార్థి అరెస్ట్

  • అధ్యాపకురాలి చిత్రాలను అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టిన విద్యార్థి
  • అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్
  • పోలీసులకు ఫిర్యాదు

అధ్యాపకురాలిపై కక్షతో ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోని ఫొటోలను సేకరించి అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్‌పేటకు చెందిన వంగరి భాను ప్రకాష్ (21) బీటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరి స్నేహితుల్లో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన భానుప్రకాశ్, అతడి స్నేహితులు కలిసి ప్రథమ చికిత్స చేశారు. ఈ క్రమంలో అక్కడ హంగామా సృష్టించడంతో కళాశాల మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడికి చేరుకుని అక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలని, విద్యార్థికి తామే చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. దీంతో భానుప్రకాశ్‌కు-ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో అధ్యాపకురాలిపై కక్ష పెంచుకున్న భాను ప్రకాశ్ ఆమెను ఎలాగైనా వేధించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలోని ఫొటోలను సేకరించి వాటిని అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టాడు. ఆమె ఫోన్ నంబరును కూడా జోడించడంతో అపరిచితుల నుంచి ఆమెకు ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజ్‌లు కూడా వస్తుండడంతో మనోవేదనకు గురైన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News