germany: ఆంధ్రులకు మాటిస్తున్నా.. ప్రత్యేక హోదా ఇచ్చితీరుతా!: కాంగ్రెస్ చీఫ్ రాహుల్

  • జర్మనీ రాజధాని బెర్లిన్ లో ప్రకటన
  • ఇచ్చిన హామీని తేలిగ్గా తీసుకోం
  • లండన్ కు బయలుదేరిన రాహుల్

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రులకు మాట ఇచ్చామనీ, దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ మాట్లాడారు.

‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాటను అంత తేలిగ్గా తీసుకోం. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని ఏపీ ప్రజలకు నేను మాటిస్తున్నా’ అని రాహుల్ తెలిపారు. ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలపై దృష్టి సారిస్తూ బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.

  నిజాలు వెళ్లినంత వేగంగా అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లలేవని రాహుల్ అన్నారు. ‘ప్రధాని మోదీ నన్ను, ప్రతిపక్షాలను విమర్శిస్తూ, మారు పేర్లతో పిలుస్తున్నారు. కానీ వాళ్లు చేసిన దూషణలు వేగంగా ప్రజల్లోకి వెళ్లాయా? నేను మోదీని ఆలింగనం చేసుకున్న ఘటన ప్రజల్లోకి వెళ్లిందా?’ అని రాహుల్ ప్రశ్నించారు. సాధారణంగా ప్రజలు ఎక్కడైనా న్యాయం కోసం కోర్టుకు వెళతారనీ, మోదీ హయాంలో మాత్రం ఏకంగా జడ్జీలే న్యాయం కోసం ప్రజల ముందుకు వచ్చారని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ, ఆరెస్సెస్ కలసి నాశనం చేయడానికి అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

జర్మనీలో గత రెండు రోజులుగా పర్యటించిన రాహుల్, ఈ రోజు బ్రిటన్ కు బయలుదేరారు. శనివారం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మరో సదస్సులో రాహుల్ పాల్గొననున్నారు.

germany
Rahul Gandhi
Congress
berlin
Special Category Status
london
indian overseas congress
Andhra Pradesh
Narendra Modi
BJP
India
  • Loading...

More Telugu News