Telangana: పెళ్లికి నిరాకరించారని.. ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్యాయత్నం!

  • ప్రేమ పెళ్లికి నిరాకరించిన యువతి కుటుంబ సభ్యులు
  • ఓ నాయుకుడు, ప్రియురాలి కుటుంబ సభ్యులు బెదిరించారని వాంగ్మూలం
  • కేసు నమోదు చేయని పోలీసులు

ప్రేమ పెళ్లికి అమ్మాయి తరపు వారు నిరాకరిస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమై మంటలు ఆర్పి అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బోరబండ సంజయ్ నగర్‌కు చెందిన భాస్కర్, అలియాస్ చంటి బీ ఫార్మసీ చదువుకున్నాడు. కాలేజీలో తన జూనియర్ అయిన మహబూబ్‌నగర్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి అమ్మాయి తరపు వారు అంగీకరించకపోగా, భాస్కర్‌ను బెదిరించారు. దీంతో గురువారం మహబూబ్‌నగర్ వెళ్లిన భాస్కర్ ప్రియురాలి ఇంటికి చేరుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు.

అప్రమత్తమైన ఇరుగుపొరుగువారు మంటలు అదుపు చేసి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పోలీసు విచారణలో తన ఆత్మహత్యా యత్నానికి ప్రియురాలి బంధువైన నాయకుడు, ఆమె కుటుంబ సభ్యులే కారణమని పేర్కొన్నాడు. అయితే, పోలీసులు మాత్రం గురువారం రాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana
Hyderabad
Mahbubnagar District
Lover
Suicide
  • Error fetching data: Network response was not ok

More Telugu News