BJP: భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో కొత్త స్కామ్!: బీజేపీ నేత సోము వీర్రాజు
- టీడీపీ అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్లలో అవినీతి
- ప్రభుత్వ రంగ సంస్థలను కాదని ప్రైవేట్ పరం చేసే యోచన
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతలు ఈ రోజు విజయవాడలో భేటీ అయిన సంగతి విదితమే. ఏపీ సర్కార్‌పై పలు అంశాలపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై విరుచుకుపడ్డారు.
భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం, కొత్త స్కామ్‌కు తెరదీసిందని అన్నారు. ఎంతో అనుభవం వున్న ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విమానాశ్రయ నిర్మాణానికి ముందుకు వచ్చిందని, అయితే, ప్రభుత్వ రంగ సంస్థలు టెండర్లు వేయకుండా ఆంక్షలు పెట్టారని, అసలు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పాల్గొనకూడదో చెప్పాలని ప్రశ్నించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రైవేట్ రంగ సంస్థలకు కట్టబెట్టి అవినీతికి పాల్పడే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం వుందని సోము వీర్రాజు తెలిపారు. టెండర్ల రద్దుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.