Farukh Abdulla: వారిని ఎవరో తప్పుదోవ పట్టించారు!: ఫరూక్ అబ్దుల్లా
- బక్రీద్ ప్రార్థన సందర్భంగా మాజీ ముఖ్యమంతిక్రి నిరసన సెగ
- ‘భారత్ మాతాకీ జై’ అన్న రెండు రోజులకే ఘటన
- నిరసన కారులంతా నా మనుషులే : అబ్దుల్లా
భారత్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభ సందర్భంగా ‘భారత మాతాకీ జై’ అన్న నినాదాలు చేసిన జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు రెండు రోజుల తర్వాత నిరసన సెగ తగిలింది. బక్రీద్ ప్రార్థనల సందర్భంగా శ్రీనగర్‌లోని హజరత్ బాల్ మసీదులో పలువురు నిరసన కారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘ఫరూక్ అబ్దుల్లా మీరు వెళ్లిపోండి...మాకు స్వాతంత్ర్యం కావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన దగ్గరకువచ్చే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై అబ్దుల్లా స్పందిస్తూ ‘నిరసన కారులంతా నా మనుషులే, వారిని ఎవరో తప్పుదోవ పట్టించారు. వారి నాయకుడి బాధ్యత నుంచి నేను తప్పించుకోను. ప్రతి ఒక్కరినీ సమైక్యంగా ఉంచే బాధ్యత నాపై ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్లో బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగింది.