TTD: శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణం.. ఇంటి దొంగ శ్రీనివాసులు అరెస్ట్!
- అక్రమంగా వెయ్యి సేవా టికెట్లు
- నకిలీ ఓటర్ కార్డులతో కొట్టేసిన శ్రీనివాసులు
- అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు
శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి శ్రీనివాసులును విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. లక్కీడిప్ లో అక్రమంగా దాదాపు 1,000 సుప్రభాత టికెట్లు పొందిన శ్రీనివాసులు ఒక్కో టికెట్ ను రూ.3 వేలకు అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ వారంలోనూ మరో 16 సేవ టికెట్లను దక్కించుకున్నట్లు తేల్చారు.
టీటీడీలో సేవ టికెట్ల కుంభకోణంలో గత 3 నెలలుగా విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం షోలాపూర్ కు చెందిన ప్రభాకర్ అనే దళారిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ప్రజల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి 1,200 సేవ టికెట్లను దక్కించుకున్నట్లు తెలిసి విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. ప్రభాకర్ నుంచి సేకరించిన సమాచారంతో చెన్నై, గుంటూరు కేంద్రంగా ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
తాజాగా అధికారుల విచారణలో నకిలీ ఓటర్ కార్డుల ద్వారా లక్కీడిప్ లో శ్రీనివాసులు వెయ్యికిపైగా సుప్రభాత సేవ టికెట్లను అక్రమంగా పొందినట్లు తేలింది. గత నాలుగేళ్లుగా శ్రీనివాసులు ఇలా నకిలీ ఓటర్ కార్డులతో శ్రీవారి సేవా టికెట్లను తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.