farooq abdullah: మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు చేదు అనుభవం.. చెప్పులు చూపించిన జనం!
- వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ ‘జై హింద్’ అన్నందుకు నిరసన
- చెప్పులు చూపించి వ్యతిరేక నినాదాలు
- వెనక్కి వెళ్లిన ఫరూక్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. బక్రీద్‌ను పురస్కరించుకుని శ్రీనగర్‌లోని ఓ ప్రార్థనా మందిరానికి చేరుకున్న ఆయనకు వ్యతిరేకంగా యువత నినాదాలు చేశారు. చేతిలో చెప్పులు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది మాజీ సీఎంను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయికి సోమవారం ఫరూక్ అబ్దుల్లా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ‘భారత్ మాతా కీ జై’, ‘జైహింద్’ అని ఆయన నినదించారు. ఇది యువతకు నచ్చలేదు. ఫరూక్ అలా నినదించడాన్ని యువత జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆయన రాగానే వ్యతిరేక నినాదాలు చేసింది. ఫరూక్ అక్కడున్నంత సేపు ‘ఆజాదీ’ అంటూ నినదించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.