Hyderabad: వీళ్లు కిలేడీలే... 24 గంటల్లో పట్టుబడ్డ ఆయుష్ కిడ్నాపర్లు... మరో ఇద్దరు కిడ్నాపైన పిల్లలూ లభ్యం!
- సోమవారం సికింద్రాబాద్ లో కిడ్నాపైన ఆయుష్
- కేసును ఛేదించిన పోలీసులు
- కీలక ఆధారాలు ఇచ్చిన ఆర్టీసీ బస్సు సిబ్బంది
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కిడ్నాపైన బాలుడిని వెతికే క్రమంలో హైదరాబాద్ పోలీసులు ఓ చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. వారి నుంచి నిన్న కిడ్నాపైన ఆయుష్ (4)తో పాటు మరో ఇద్దరు చిన్నారులనూ రక్షించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి, రైల్వే ఎస్పీ జీ అశోక్ కుమార్ లు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లా మన్నాపూర్ కు సంజూ చామర్ (32) తన కుమారుడు ఆయూష్ (4), కుమార్తె అంజలి (7)తో కలసి సొంతూరుకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రాగా, ఆయుష్ కిడ్నాప్ అయ్యాడు. సంజూ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు రంగంలోకి దిగి, 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టగా, సీసీటీవీ ఫుటేజ్ లో వారికి చిన్నారిని ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.పోలీసులు అరెస్ట్ చేసిన పిల్లల కిడ్నాపర్లు యాదమ్మ, జయ
ఈ క్రమంలో ఓ బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం పోలీసులకు అత్యంత కీలకంగా మారింది. పిల్లలను తీసుకుని '25 ఎస్' బస్సు ఎక్కిన కిడ్నాపర్లు, చిల్లర కోసం కండక్టరుతో గొడవ పడ్డారు. "మా అంబేద్కర్ నగర్ నుంచి స్టేషన్‌కు 10 రూపాయలే కదా?" అని వారు వాగ్వాదానికి దిగారు. దీంతో వారు అంబేద్కర్ నగర్ వాసులై ఉంటారన్న అనుమానంతో, అక్కడికి వెళ్లి ఇల్లిల్లూ తనిఖీలు చేశారు. అప్పటికే టీవీల్లో వార్తను చూసిన స్థానికులు ఇచ్చిన వివరాలతో యాదమ్మ (21), ఎం. జయ (18)లను అరెస్ట్ చేశారు. వారి వద్ద మరో ఇద్దరు పిల్లలు కూడా కనిపించారు.యాదమ్మ, జయ వద్ద లభించిన చిన్నారులు వీరే
పోలీసులు విచారిస్తే, తొలుత తమ బిడ్డలని బుకాయించిన ఈ కిలేడీలు, ఆపై వారిని కిడ్నాప్ చేసి తెచ్చామని అంగీకరించారు. 2015లో ఉందానగర్ లో కిడ్నాపైన శేఖర్, మేడ్చల్ రైల్వే స్టేషన్ లో కిడ్నాపైన రేణుక కూడా వీరి వద్ద దొరికారని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పుగూడకు చెందిన అంజయ్య కుమారుడే శేఖర్ అని గుర్తించామని, రేణుక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతానికి చెందిన పాప కావడంతో, అక్కడికి సమాచారం పంపామని తెలిపారు. ఈ కేసు విచారణలో బస్సు సిబ్బంది, స్థానికులు ఇచ్చిన సహకారం కీలకమైందని చెప్పారు.