Bajaj Auto: కేరళకు రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన బజాజ్
- బజాజ్ ట్రస్ట్ నుంచి ఇది వరకే రూ.50 లక్షలు అందజేత
- తాజాగా బజాజ్ ఆటో నుంచి రూ.2 కోట్లు
- హ్యూండాయ్ మోటార్స్ రూ. కోటి
- ఎస్‌బీఐ రూ.రెండు కోట్ల విరాళం ప్రకటన
జల విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇందులో కోటి రూపాయలను సీఎం సహాయనిధికి, మరో కోటి రూపాయలను జానకీదేవి బజాజ్ గ్రామ్ వికాస్ సంస్థకు అందిస్తున్నట్లు తెలిపింది. కేరళలోని బాధిత ప్రజలకు అవసరమైన వస్తువులను ఈ సంస్థ ద్వారా అందించనున్నట్టు పేర్కొంది. కాగా, బజాజ్ ట్రస్ట్ నుంచి కేరళకు ఇప్పటికే రూ.50 లక్షల విరాళం అందించారు.
ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలమైన కేరళకు తాము అండగా ఉంటామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ఇంట్రాసిటీ బిజినెస్) ఆర్‌సీ మహేశ్వరి పేర్కొన్నారు. కేరళలోని తమ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రజలకు అవసరమైన సాయం అందిస్తామని వివరించారు. మరో ఆటోమొబైల్ సంస్థ, కార్ల తయారీలో పేరెన్నికగన్న హ్యూండాయ్ మోటార్స్ కేరళకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది.