sailaja reddy alludu: 'శైలజారెడ్డి అల్లుడు' విడుదలపై నాగ చైతన్య ట్వీట్
- కేరళలో జరుగుతున్న 'శైలజారెడ్డి అల్లుడు' రీరికార్డింగ్
- వరదల కారణంగా పూర్తి కాని పనులు
- త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్న చైతూ
కేరళ జల ప్రళయం టాలీవుడ్ పై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో కేరళకు చెందిన ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు పని చేస్తున్నారు. వరదల కారణంగా వారంతా షూటింగుల్లో, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. దీంతో, మన సినిమాల విడుదల ఆలస్యమవుతోంది.
అక్కినేని నాగచైతన్య నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకు కూడా కేరళ షాక్ తగిలింది. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 31న విడుదల కావాల్సి ఉంది. కానీ కేరళలో నెలకొన్న పరిస్థితి వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీనిపై నాగచైతన్య ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'కేరళలో నెలకొన్న దారుణ పరిస్థితుల వల్ల సినిమా రీరికార్డింగ్ ను అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. రీరికార్డింగ్ కేరళలోనే జరుగుతోంది. దీంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేకపోయాయి. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసి, ప్రకటిస్తాం' అంటూ ట్వీట్ చేశాడు. సినిమా విడుదల వాయిదా పడిన నేపథ్యంలో, అభిమానులను చైతూ క్షమాపణలు కోరాడు. ఇదే సమయంలో కేరళ బాధితులకు అందరూ సహాయం చేయాలని కోరాడు.