Tirumala: తిరుమల లోయలోకి దూకుతున్నానంటూ పోలీసులకు సెల్ఫీ పంపిన యువతి!

  • కుటుంబ సభ్యులతో గొడవ
  • గుడికి వెళ్లొస్తానంటూ తిరుమలకు
  • ఆత్మహత్యాయత్నం చేసిన నీరజ

తిరుమల నడకదారిలోని అవ్వాచారికోనలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ యువతి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం మేరకు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన నీరజ, కుటుంబ సభ్యులతో గొడవపడి, తిరుమలలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ఘాట్ రోడ్డులోని మోకాళ్లమిట్ట సమీపంలో ఉన్న అవ్వాచారికోన లోయ ముందు నిలబడి, సెల్ఫీ ఫొటో తీసుకుని, దాన్ని వాట్స్ యాప్ లో పోలీసులకు పంపి దూకేసింది.

ఈ సెల్ఫీని చూడగానే, ఆమె ఆత్మహత్య చేసుకుంటోందని అలర్ట్ అయిన పోలీసులు, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, ఆ ప్రాంతానికి వెళ్లారు. దాదాపు 60 అడుగుల లోతులోకి పడ్డ నీరజను గుర్తించి, బయటకు తెచ్చారు. తొలుత అశ్విని ఆసుపత్రిలో, ఆపై మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ కు తరలించారు. ఆపై జగ్గయ్యపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా, సదరు యువతి, రెండు రోజుల క్రితమే తప్పిపోయినట్టు ఫిర్యాదు నమోదైందని వారు వెల్లడించారు. మూడేళ్ల క్రితం నీరజకు వివాహం కాగా, ఇటీవల ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. గుడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి, నేరుగా తిరుమలకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

Tirumala
Avvachari kona
Tirupati
Neeraja
  • Loading...

More Telugu News