Kochi: కొచ్చి ఎయిర్ పోర్టులోకి భారీ వరదకు అసలు కారణమిదే!
- భారీ వర్షాలతో జలవిలయం
- 11 రోజులుగా మూతబడ్డ నెడుంబాసరే విమానాశ్రయం
- పెరియార్ నదికి వచ్చిన వరదే కారణం
కేరళలో భారీ వర్షాల కారణంగా జల విలయమే జరుగగా, కొచ్చి శివార్లలోని నెడుంబాసరే అంతర్జాతీయ విమానాశ్రయం గత 11 రోజులుగా మూతబడివుంది. మరో ఐదు రోజుల పాటు అంటే... ఈ నెల 26 వరకూ ఎయిర్ పోర్టు మూసే ఉంటుందని అధికారులు ప్రకటించినా, ఆలోగా వరద నీరు దిగువకు వెళ్లిపోతుందా అన్నది సందేహమే. ఈ విమానాశ్రయం పరిసరాల్లో దాదాపు 100 మంది మరణించారు. ఈ ఎయిర్ పోర్టును మూసివేయడం ఇదే తొలిసారి కాదు. 2013లో ఇదమలేయర్ డ్యామ్ గేట్లను తెరవాల్సి వచ్చినప్పుడు కూడా కొచ్చి ఎయిర్ పోర్టును రెండు రోజులు మూసేశారు.కొచ్చి ఎయిర్ పోర్టు చుట్టూ ప్రవహిస్తున్న పెరియార్ నది (వికీమాపియా చిత్రం)
ఎయిర్ పోర్టులోకి ఇంత భారీ వరద రావడానికి కారణం, దీనిని పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో నిర్మించడమేనంటున్నారు పర్యావరణ నిపుణులు. దీని రన్ వే కోసం పెరియార్ ప్రధాన కాలువైన 'చెంగల్ తోడు'తో పాటు మరో మూడు పంట కాలువలను మళ్లించారు. పైగా, ఈ నది పక్కన భారీ ఆవాసాలు వెలిశాయి. కాలువలను మళ్లించిన వేళ, వాటి వెడల్పు కుచించుకుపోయింది. కాలువలను మళ్లించవద్దని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసనలకు దిగినా, అప్పటి పాలకులు పట్టించుకోలేదు. వాస్తవానికి చెంగల్ తోడుకు ప్రతియేటా వరద వస్తూనే ఉంటుంది. అయితే, వర్షాలు భారీగా కురిస్తే, జరిగే నష్టం ఏంటన్న సంగతి ఇప్పటికి తెలిసొచ్చింది. ఈ వరదల కారణంగా కొచ్చి ఎయిర్ పోర్టుకు దాదాపు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.