Supreme Court: ఆపరేషన్ బ్లూస్టార్ నాటి మిలటరీ అధికారికి సుప్రీంకోర్టులో ఊరట!
- ‘ఆపరేషన్ బ్లూస్టార్’ అధికారికి హోదా నిలుపుదల
- లెఫ్టినెంట్ కల్నల్ హోదాను వెంటనే ఇవ్వాలని సుప్రీం ఆదేశం
- కున్వర్ అంబ్రేశ్వర్ సింగ్ పై వచ్చిన ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అప్పట్లో స్వర్ణ దేవాలయం నుంచి ఖలిస్తాన్ తీవ్రవాదులను బయటకు రప్పించేందుకు నిర్వహించిన ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్న మేజర్ కున్వర్ అంబ్రేశ్వర్ సింగ్ కు ఇవ్వకుండా ఆపిన హోదాను ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తనకు ఇవ్వకుండా ఆపిన లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇవ్వాలని కోరుతూ గతంలో సాయుధ బలగాల ట్రైబ్యునల్‌ను సింగ్ ఆశ్రయించగా ఆయనకు అక్కడ అనుకూలంగా తీర్పువచ్చింది.
అయితే దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏఎఫ్‌టీ తీర్పుకే మద్దతు పలికింది. ఆయనపైన వచ్చిన ఆరోపణలను సైతం కొట్టిపారేసింది.
ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో ఆయన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను తన దగ్గరే ఉంచుకున్నారని, ఇష్టారీతిన ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకే కేంద్రం ఆయనకు ఇవ్వాల్సిన లెఫ్టినెంట్ కల్నల్ హోదాను నిలుపుదల చేసింది. దీనిపై ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయనకు ఊరట లభించింది.