salim kumar: ప్రాణాలు చేతపట్టుకుని బిక్కుబిక్కుమంటూ 3 రోజులు!: కేరళలో నటుడు సలీమ్ కు నరకం
- కొచ్చిలో సలీమ్ ఇంట్లో చిక్కుకున్న 30 మంది
- మూడు రోజులుగా సాయం కోసం ఎదురుచూపు
- కాపాడిన విపత్తు నిర్వహణ అధికారులు
కేరళలో విధ్వంసం సృష్టిస్తున్న భారీ, వర్షాలకు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరూ అల్లాడుతున్నారు. ఇళ్లలో చిక్కుకుని కనీసం ఆహారం, తాగే నీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీరిలో ప్రముఖ మలయాళీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీమ్ కుమార్ కూడా ఉన్నారు.
కొచ్చిలోని పరవూరు-కొడుంగల్లూరు ఆలమ్మవు జంక్షన్ లో సలీమ్ ఇల్లు ఉంది. భారీ వర్షాలు, వరదలతో పరిస్థితి దిగజారుతోందని తెలియగానే అక్కడి నుంచి వెళ్లిపోవాలని తొలుత సలీమ్ అనుకున్నారు. అయితే తానిక్కడే ఉంటే మరికొందరికి ఆశ్రయం ఇవ్వగలనన్న భావనతో ఆగిపోయారు. కొచ్చికి వరద పోటెత్తగానే ఇరుగుపొరుగువారు, బంధువులు దాదాపు 30 మంది సలీం ఇంట్లోని మొదటి అంతస్తులో బిక్కుబిక్కుమంటూ గడపడం మొదలుపెట్టారు.
వీరంతా దాదాపు 3 రోజుల పాటు ఎలాంటి సాయం లేకుండా ఇక్కడ చిక్కుకుపోయారు. విపత్తు నిర్వహణ అధికారులకు సలీమ్ ఫోన్ చేస్తే.. ‘త్వరలోనే మీ అందరినీ కాపాడుతాం.. ధైర్యంగా ఉండండి’ అంటూ ఫోన్లు వచ్చాయే తప్ప ఎలాంటి సాయం రాలేదు. చివరికి నాలుగో రోజు ఘటనాస్థలికి నాటు పడవల్లో చేరుకున్న అధికారులు సలీం సహా 45 మందిని కాపాడగలిగారు.