apple: యాపిల్ కంపెనీ మెయిన్ ఫ్రేమ్ ను హ్యాక్ చేసిన టీనేజర్.. ఎంత సమాచారాన్ని కొల్లగొట్టాడో తెలుసా?
- యాపిల్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా టీనేజర్
- ఎఫ్ బీఐకి ఫిర్యాదు చేసిన కంపెనీ
- కోర్టులో నేరం అంగీకరించిన యువకుడు
కంప్యూటర్ హ్యకింగ్, డేటా చోరీ ఈ మధ్యకాలంలో సాధారణమైపోయాయి. అయితే మిగతా ఫోన్లు, కంప్యూటర్లతో పోల్చుకుంటే యాపిల్ కంపెనీ ఉత్పత్తుల సెక్యూరిటీ ఫీచర్లు బలంగా ఉంటాయని చాలామంది నమ్ముతారు. కొంచెం ఆర్థిక స్తోమత ఉన్నవారు ఐ ఫోన్, మ్యాక్ బుక్ వంటి వాటిని కొనేందుకు ప్రాధాన్యమిస్తారు. అయితే ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఓ స్కూలు విద్యార్థి(16) మాత్రం కేవలం కంప్యూటర్ సాయంతో ఏకంగా హై సెక్యూరిటీ ఉండే యాపిల్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లను హ్యాక్ చేసేశాడు.
అక్కడితో ఆగకుండా యాపిల్ కంపెనీ కంప్యూటర్లలో యూజర్లకు సంబంధించిన 90 జీబీ రహస్య సమాచారాన్ని హాయిగా డౌన్ లోడ్ చేసుకున్నాడు. వీపీఎన్ తో పాటు టన్నెల్స్ సాయంతో సదరు టీనేజర్ యాపిల్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లను ఈ ఏడాదిలో చాలాసార్లు హ్యాక్ చేయగలిగాడు. చివరికి ఈ హ్యాకింగ్ ను గుర్తించిన యాపిల్ నిపుణులు ఎఫ్ బీఐకి సమాచారం అందజేశారు. వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేయడంతో సదరు టీనేజర్ ఇంటిపై దాడిచేసి కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నాడు.
అయితే సరదా కోసమే తాను ఈ పనిచేశాననీ, యాపిల్ ఉత్పత్తులకు తాను వీరాభిమానినని సదరు టీనేజర్ పోలీసులకు తెలిపాడు. చివరికి అతడిని కోర్టులో హాజరుపర్చగా.. నేరం చేసినట్లు జడ్జి ముందు అంగీకరించాడు. దీంతో వచ్చే నెలలో ఈ బాలుడికి శిక్షను ఖరారు చేయనున్నారు. అయితే ఇతడిని కొందరు కాబోయే బిల్ గేట్స్ గా అభివర్ణిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ కూడా ఓ పెద్ద సంస్థకు చెందిన కంప్యూటర్ ను హ్యాక్ చేశారు. దీంతో ఏడాదిపాటు కంప్యూటర్ వాడకూడదని ఆయన్ను అధికారులు అప్పట్లో ఆదేశించారు.