Rajiv Gandhi: నాకు ప్రాణం పోసింది రాజీవ్ గాంధీనే: వాజ్‌పేయి కృతజ్ఞత
- వాజ్‌పేయికి కిడ్నీ సమస్య
- స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన రాజీవ్ గాంధీ
- ఆయన చలువతోనే న్యూయార్క్‌లో చికిత్స
తాను బతికి ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ వల్లేనని వాజ్‌పేయి పలుమార్లు పేర్కొన్నారు. 1988లో వాజ్‌పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. విదేశాల్లో చికిత్స చేయించుకుంటే తప్ప కష్టం. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాజ్‌పేయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి తెలిసింది.
విషయం తెలిసిన వెంటనే వాజ్‌పేయిని తన కార్యాలయానికి రమ్మని రాజీవ్ ఆహ్వానించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్లే బృందంలో మిమ్మల్ని కూడా చేర్చుతున్నానని, కాబట్టి సదస్సు అనంతరం న్యూయార్క్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని వాజ్‌పేయికి సూచించారు. దీనికి వాజ్‌పేయి సరేననడంతో అలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని వాజ్‌పేయి స్వయంగా సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్‌తో పంచుకున్నారు. తానీ రోజు బతికి ఉన్నానంటే దానికి కారణం రాజీవ్ గాంధీయేనని వాజ్‌పేయి పలుమార్లు పేర్కొన్నారు.