Mutualfunds: మ్యూచువల్ ఫండ్స్ పై ఇన్వెస్టర్ల ఆసక్తి.. పెరుగుతున్న పెట్టుబడులు!
- ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడుల ఆసక్తి
- సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లపై నమ్మకమే దీనికి కారణం
- దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈక్విటీ ఎమ్‌ఎఫ్‌ల వైపు ఇన్వెస్టర్ల చూపు
భారత దేశంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)ల పై అవగాహన పెరగటమే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్డడానికి కారణం. గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ.10,585 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని ఆంఫి వెల్లడించింది.
సగటు భారత ఇన్వెస్టర్లకు ఆర్థిక అంశాలపై అవగాహన పెరగటం, దీర్ఘకాలంలో రెండంకెల రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు లేకపోవడం, వ్యవస్థాగతంగా భారత్ పటిష్టమైన వృద్ధిని సాధించగలదని పెరిగిన విశ్వాసం వల్లే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లలో బుల్ రన్ కొనసాగుతుండటంతో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయనే భావన వుంది.
ప్రస్తుతం భారత్‌లో 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల నిర్వహణ ఆస్తులు రూ.23 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు ఈ ఏడాది జూన్ త్రైమాసికానికి రూ.8.3 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూలై క్వార్టర్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ.43,300 కోట్లకు పెరగడంతో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 10 శాతం మేర పెరిగాయి. గత నెలలో ఇన్వెస్టర్లు రూ.32,000 కోట్ల పెట్టుబడులను ఫండ్స్ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అందుకే ఈ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది.