girls trafficking: ముంబైలో ఘోరం.. నగరం నుంచి అమెరికాకు 300 మంది అమ్మాయిల అక్రమ రవాణా!
- 2007 నుంచి 300 మంది అమ్మాయిల అక్రమ రవాణా
- ఒక్కో బాలిక రూ.45 లక్షలకు విక్రయం
- కీలక సూత్రధారి అరెస్ట్
పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన మరో దారుణం వెలుగు చూసింది. ఓ అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణ ముఠా ముంబై నుంచి అమెరికాకు ఏకంగా 300 మంది చిన్నారులను విక్రయించినట్టు బయటపడడం సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన రాజుభాయ్ గమ్లేవాలా నేతృత్వంలోని ముఠా ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2007 నుంచి ఇప్పటి వరకు 300 మంది నిరుపేద బాలికలను అమెరికాకు అక్రమంగా తరలించి విక్రయించినట్టు పోలీసులు తెలిపారు.
బాలికలంతా గుజరాత్‌కు చెందినవారేనని, 11-16 ఏళ్ల మధ్య వయసు వారేనని పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో అమ్మాయిని రూ. 45 లక్షలకు అమెరికన్లకు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గుజరాత్‌లోని నిరుపేదలను ఎంచుకునే ముఠా వారికి డబ్బుల ఆశ చూపి దొంగ పాస్‌పోర్టులతో వారిని దేశం దాటించింది. బాలికలను దేశం దాటించేముందు వారికి చక్కగా మేకప్ చేసేందుకు ఓ సెలూన్‌కు తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో నగరంలోని వెర్సోవా సెలూన్‌కు ఇద్దరు బాలికలను తీసుకురాగా, సినీ నటి ప్రతీసూద్ అనుమానంతో వారిని ప్రశ్నించగా విషయం వెలుగు చూసింది.
ప్రీతిసూద్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. అక్రమ రవాణా ముఠాలో రిటైర్డు ఎస్సై కుమారుడి పాత్ర ఉన్నట్టు తేలింది. నలుగురు నిందితులు ఆమిర్ ఖాన్ (26), తాజుద్దీన్ ఖాన్ (48), రిజ్వాన్ చోటానీ (39), అఫ్జల్ షేక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిచ్చిన సమాచారంతో రాజు భాయ్ సింగ్ అనే కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు.