asutosh: కేజ్రీవాల్ కు షాకిచ్చిన అశుతోష్.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా!
- ఆమోదించాలని పార్టీకి విజ్ఞప్తి
- వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నానని స్పష్టీకరణ
- రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న నేత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ పార్టీకి రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు అశుతోష్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
రాజీనామా విషయాన్ని అశుతోష్ ట్విట్టర్ లో ప్రకటించారు. ‘ ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఆప్ తో నా ప్రయాణం విప్లవాత్మకం, అద్భుతమైనది. దీనికి కూడా ముగింపు ఉంది. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. నా రాజీనామాను అంగీకరించాలని పార్టీని కోరుతున్నా. ఇన్నాళ్లు పార్టీకి, నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు అశుతోష్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆప్ కు రాజీనామా సమర్పించారు.