jamili elections: జమిలి ఎన్నికలు అసాధ్యం: మోదీ, అమిత్ షా ఆశలపై నీళ్లు చల్లిన కేంద్ర ఎన్నికల సంఘం

  • రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది
  • వివిధ శాసనసభల గడువులను మార్చాల్సి ఉంటుంది
  • భారీ ఎత్తున పోలీస్, పోలింగ్, భద్రత యంత్రాంగం అవసరం

దేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల ఆశలపై కేంద్ర ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. జమిలి ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే... దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే... వివిధ శాసనసభల గడువును తగ్గించడమో లేదా పెంచడమో చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలన్నింటినీ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు.

100శాతం వీవీపాట్ యంత్రాలను ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం కూడా కష్టమైన అంశమేనని రావత్ చెప్పారు. సమీప భవిష్యత్తులో జమిలి ఎన్నికలను నిర్వహించడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సరిపడా పోలీస్, పోలింగ్, భద్రత యంత్రాంగం అవసరమని చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ న్యాయ కమిషన్ కు అమిత్ షా లేఖ రాసిన మరుసటి రోజే రావత్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. మరోవైపు, కాంగ్రెస్ సహా పలు పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. 

jamili elections
election commission
cec
op rawat
modi
amit shah
  • Loading...

More Telugu News