t-congress: టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు కేసులో సభాపతికి షోకాజ్ నోటీసులు
- కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దు పిటిషన్ విచారణ
- అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకూ నోటీసులు
- ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు
టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగగా, కోర్టు ధిక్కరణ కింద అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావుకూ హైకోర్టు నోటీసులు పంపింది.
ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల జీతభత్యాల వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లకు గన్ మెన్లను కేటాయించకపోవడాన్ని ప్రశ్నిస్తూ డీజీపీ, గద్వాల, నల్గొండ ఎస్పీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.