eathan: 14 ఏళ్లకే గవర్నర్ గా పోటీ చేస్తున్న అమెరికా పిల్లాడు.. గెలిస్తే చరిత్రే!
- వెర్మోంట్ గవర్నర్ రేసులో ఈథన్
- తుపాకీ సంస్కృతిని నియంత్రిస్తానని హామీ
- గెలిస్తే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
పద్నాలుగేళ్ల పిల్లాడు ఏం చేస్తుంటాడు?.. ఉదయాన్నే బండెడు పుస్తకాలతో స్కూలుకు వెళతాడు. సాయంత్రం ఇంటికి వచ్చి మళ్లీ ట్యూషన్ కు పోతాడు. ఇంటికొచ్చాక కొంచెం టైమ్ మిగిలితే వీడియో గేమ్ ఆడుకుంటాడు. చివరికి అన్నం తిని పడుకుంటాడు. ఎక్కడైనా పిల్లలు దాదాపు ఇదే రకంగా ఉంటారు. కానీ అమెరికాలోని వెర్మోంట్ రాష్ట్రానికి చెందిన ఈథన్ సోన్నేబోన్ మాత్రం డిఫరెంట్. చదువుకోవాల్సిన వయసులో ఈథన్ రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈథన్ చరిత్ర సృష్టించనున్నాడు.
వెర్మోంట్ రాష్ట్ర గవర్నర్ గా పోటీ చేసేందుకు కనీస వయసు నిబంధన లేకపోవడంతో ఇది సాధ్యమైంది. పిల్లాడు కదా.. వీడేం చేస్తాడులే అని అనుకోవద్దు. ఈ నెలలో జరిగే ఎన్నికల్లో తాను గెలిస్తే రాష్ట్రంలో చేపట్టబోయే సంస్కరణలు, అభివృద్ధి పనుల అజెండాను వివరిస్తున్నాడు. తుపాకుల విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ, పౌరులందరికీ ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై దృష్టి సారిస్తానని చెబుతున్నాడు.
ఇంతకుముందు గవర్నర్ ఎన్నికలలో గెలిచిన అత్యంత పిన్నవయస్కుడిగా ఎఫ్.రే.కైజర్(33) నిలిచారు. తాజా ఎన్నికల్లో ఈథన్ విజయం సాధిస్తే వెర్మోంట్ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన గవర్నర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఈథన్ గవర్నర్ పదవికి పోటీపడడాన్ని రాజకీయ మేధావులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రజాసేవకు వయసు అడ్డంకి కాదని ఈథన్ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు.