Pawan Kalyan: వెన్నుపోట్లతో ముఖ్యమంత్రి కావాలనుకోవద్దు: లోకేశ్ కు పవన్ సూచన
- మీ నాన్నను కాదు మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకోండి
- క్షేత్రస్థాయికి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోండి
- టీడీపీతో ‘హోదా’ కాదు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా రాలేదు
‘లోకేష్ గారు ముఖ్యమంత్రి కావచ్చు... అయితే వెన్నుపోటు పొడిచి కాదు’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
లోకేశ్ తాత ఎన్.టి.రామారావులా అరవై ఏళ్ళ తర్వాత కూడా ముఖ్యమంత్రి కావచ్చని, ఎన్టీఆర్ ఎన్నో కష్టనష్టాలు చూసి ఆ స్థాయికి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లోకేష్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని వెన్నుపోటు పొడవాలని చూడకూడదని వ్యాఖ్యానించారు.
‘స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో లోకేష్ చదువుకున్నారు. అదే యూనివర్సిటీలో చదువుకున్న అమెరికా 35వ అధ్యక్షుడు కెనడీ చెప్పిన మాటను లోకేష్ గ్రహించాలి. ‘దేశం నాకేమిచ్చింది అని కాదు... దేశానికి నేను ఏమిచ్చాను’ అని కెనడీ చెప్పారు. లోకేష్ మాత్రం దేశంలో ఎంత జుర్రుకున్నామో చూస్తున్నారు. మీరు మీ నాన్నగారిని కాకుండా అబ్రహం లింకన్, కెనడీ, గాంధీజీ, పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకోండి. క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలు తెలుసుకోండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. కనీసం నిడదవోలుకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా సాధించలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్న ఈ బ్రిడ్జ్ విషయంలో ఎంపీ మురళీ మోహన్ గారు శ్రద్ధ చూపడం లేదు. రైళ్లు ఎప్పుడు వస్తాయో చూసుకొని బయటకు రావాల్సిన పరిస్థితుల్లో నిడదవోలు ప్రజలు ఉన్నారు. ఇక ఇక్కడి ఇసుక మాఫియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లని తిడతాం’ అని పవన్ విమర్శించారు. తప్పో కాదో మీ అమ్మగారిని అడగండి
‘వెన్నుపోటు రాజకీయాలు మా కుటుంబానికి అలవాటు అని లోకేష్ అనుకొంటే కుదరదు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు అలా కుదరదు. ఎదురుగా కౌగిలించుకొని వెనక నుంచి పొడిచేస్తామంటే పడేవాళ్ళు లేరు. ప్రజా సమస్యలపై మాట్లాడమంటే జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. నా జీవితంలో రహస్యాలు ఏమీ లేవు. లోకేష్ కూడా నన్ను తిట్టిస్తున్నారు. నా తల్లిని అనకూడని మాటలు అనిపించారు. లోకేష్ గారు.. ఒకసారి మీ అమ్మగారిని అడగండి నేను ఇలా తిట్టించాను.. తప్పో ఒప్పో అడగండి. సరైన రోడ్లు వేయరు. పారిశుద్ధ్య నిర్వహణ ఉండదు. కానీ, ఒక్కో నియోజకవర్గాన్ని రూ.40 కోట్లు పెట్టి కొనేద్దామనుకొంటున్నారు. కుదరదు. ఇది నవతరం యువత. భగభగ మండే యువత. వీళ్ళను కొనలేరని గుర్తుపెట్టుకోండి’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
మహిళల ఖాతాలకు నగదు బదిలీ
‘వృద్ధులను చూస్తుంటే చాలా జాలి, బాధ కలుగుతుంది. ఓపిక ఉన్నంత కాలం కన్నబిడ్డల కోసం కష్టపడతారు. వృద్ధాప్యంలో వారు కోరుకొనేది బిడ్డల ప్రేమ. వివిధ కారణాలతో వారికి అవి అందటం లేదు. వృద్ధాశ్రమాల్లోకి వెళ్లిపోతున్నారు. ‘జనసేన’ వచ్చాక వృద్ధాశ్రమాలని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వృద్ధుల బాధ్యతను మేము చూసుకుంటాం. ఏ తల్లికీ కష్టం రాకుండా చూస్తాం. ఈ విషయాలన్నీ ‘జనసేన’ మేనిఫెస్టోలో చేరుస్తాం. దివ్యాంగులు, మానసిక వికలాంగులు కోసం ప్రత్యేక విధానాలు తీసుకువస్తాం.
ఆడపడుచులకు అండగా నిలవడమే జనసేన ఉద్దేశం. రేషన్ బియ్యం తినడానికి కూడా పనికి రావడం లేదు. కోళ్ల దాణాగానో, సారా బట్టీల కోసమో, కాకినాడలోని కేవీ రావు పోర్టు నుంచి ఆఫ్రికా ఎగుమతికో పనికొస్తున్నాయి. ఇది భారీ అవినీతి. దళారీలు బాగుపడుతున్నారు. అందుకే నెలకు రూ.2500 నుంచి రూ.3500 మధ్య నగదుని మహిళల ఖాతాలకు బదిలీ చేయాలని నిర్ణయించాం. ఇలా నగదు ఇస్తే సంసారాన్ని ఆడపడుచులు నడుపుకొంటారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఇవన్నీ ఎలా సాధ్యం అంటున్నారు. జగన్ లక్ష కోట్లు దోచేశారని టీడీపీ వాళ్ళు, చంద్రబాబు లక్షన్నర కోట్లు దోపిడీ చేశారని వైసీపీ ఒకరిమీద ఒకరు చెప్పుకొంటున్నారు. ఆ అవినీతిని కట్టడి చేసి ప్రజల కోసం వినియోగిస్తే అన్ని పథకాలు వస్తాయి. కేజీ బేసిన్ లో గ్యాస్ ను గుజరాత్ కి ఇచ్చేశారు. మన వాటా మనం తీసుకుంటాం. టీడీపీ, వైఎస్ కాలంలో ఏం చేశారో... ఏం తాకట్టు పెట్టారో మన గ్యాస్ తరలిపోతోంది. మన వాటా మనం రాబట్టుకొంటే ఉచిత గ్యాస్ ఇవ్వొచ్చు. మహిళ భద్రతకు పెద్దపీట వేస్తాం. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకి సంపూర్ణ మద్దతు ఇస్తాం.బీసీల మద్దతు ఉందని చెప్పుకొనే టీడీపీ ఎప్పుడూ బీసీ కులాల అభివృద్ధికి ఏమీ చేయలేదు. తాము చేరదీసిన కొద్దిమంది బీసీ నాయకులే బాగుపడ్డారు. అంటే కొన్ని కుటుంబాలు తప్ప కులాలు బాగుపడలేదు. టీడీపీ మోసాలు గ్రహించే తెలంగాణ నుంచి తన్ని తరిమేశారు. కులాల మధ్య తగవులు పెడుతున్నారు. కులాలను కలిపి ఐక్యతతో అభివృద్ధి సాధిస్తాం. కాపు రిజర్వేషన్ విషయంలోనూ 9 షెడ్యూల్ లో చేర్చి వారి డిమాండ్ నెరవేరుస్తాం’ అని పవన్ హామీ ఇచ్చారు.