china: జైలులో మానవహక్కుల లాయర్లను కలిసిన జర్మన్ విద్యార్థి.. వీసాను రద్దుచేసిన చైనా!

  • 7 రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని ఆదేశం
  • జర్మన్ విద్యార్థికి చైనా షాక్
  • కోర్సులో భాగంగానే కలిశానంటున్న బాధితుడు

అతనో జర్మన్ విద్యార్థి. జర్నలిజం కోర్సు చదవడానికి చైనాకు వెళ్లాడు. కోర్సులో భాగంగా జైలు పాలైన మానవహక్కుల లాయర్లను కలుసుకున్నాడు. దీంతో మండిపడ్డ చైనా అధికారులు అతని వీసాను రద్దు చేశారు. వారం రోజుల్లోగా దేశం వదిలి వెళ్లాలని ఆదేశించారు.

జర్మనీకి చెందిన డేవిడ్ మిస్సల్(24) జర్నలిజం కమ్యూనికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసేందుకు చైనా రాజధాని బీజింగ్ లో ఉన్న ప్రతిష్ఠాత్మక సింగ్హువా విశ్వవిద్యాలయంలో చేరాడు. అయితే, చైనా ప్రభుత్వం రెండేళ్ల క్రితం జైలులో పెట్టిన మానవహక్కుల లాయర్లను ఇతడు కలుసుకున్నాడు. ఇలాంటి వివాదాస్పద రాజకీయ అంశాలకు దూరంగా ఉండాలని వర్సిటీ అధికారులు రెండు సార్లు హెచ్చరించినా డేవిడ్ పెద్దగా పట్టించుకోలేదు.

తన అనుభవాలను సొంత యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. దీన్ని పసిగట్టిన చైనా అధికారులు డేవిడ్ వీసాను రద్దు చేశారు. వారం రోజుల్లోగా దేశం వదిలిపెట్టి పోవాలని ఆదేశించారు. దీనిపై డేవిడ్ స్పందిస్తూ.. తాను చైనా సమాజం, రాజకీయాలను అర్థం చేసుకునేందుకే జైలుపాలైన లాయర్లతో మాట్లాడానని స్పష్టం చేశాడు. యూట్యూబ్ లో తన వీడియోలు చూసేవారు 100 మంది కంటే తక్కువేనని చెప్పాడు.

తమ దేశంలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ రహస్యంగా ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అక్కడి ముస్లింలు, క్రిస్టియన్లపై కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News