chattisgargh: కాబోయే సీఎంను స్వయంవరంలో ఎన్నుకుంటాం!: ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేత
- సీతాదేవి స్వయంవరం తరహాలో ఎన్నుకుంటాం
- 15 ఏళ్ల కాంగ్రెస్ వనవాసం పూర్తయింది
- భావ సారూప్య పార్టీలతో కలసి పనిచేస్తాం
ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేత ఒకరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక ముఖ్యమంత్రిని స్వయంవరంలో ఎన్నుకుంటామని రాష్ట్ర ప్రతిపక్ష నేత టీఎస్ సింగ్ దేవ్ తెలిపారు. సీతాదేవీ శ్రీరాముడిని స్వయంవరంలో ఎంచుకున్నట్లే.. సీఎంను కాంగ్రెస్ నేతలంతా కలసి ఎన్నుకుంటామని వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా శ్రీరాముడి తరహాలో కాంగ్రెస్ వనవాసం చేసిందని టీఎస్ సింగ్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో భావ సారూప్యమున్న పార్టీలతో కలసి ముందుకెళ్తామని సింగ్ చెప్పారు. బీజేపీని అధికారం నుంచి తప్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను ఎన్నికల ముందు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేయలేదన్న విషయాన్ని సింగ్ గుర్తుచేశారు. 90 సీట్లున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి.