Rain: భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు... హైదరాబాద్ అస్తవ్యస్తం!

  • హైదరాబాద్ లో 36 గంటలుగా ఆగని వర్షం
  • లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు
  • ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన కేసీఆర్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తాంధ్ర, తెలంగాణల్లోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గత 24 గంటలుగా ముసురుపట్టి, అడపాదడపా చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్షం ప్రతి ప్రాంతంలోనూ కురుస్తూనే ఉంది. హైదరాబాద్ లో 36 గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్తమైంది.

హుసేన్ సాగర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వస్తున్న వరదను అంచనా వేసిన అధికారులు, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్డుపై వెళుతున్న ఓ కారుపై చెట్టు పడిన ఘటనలో కారు నడుపుతున్న మహిళకు గాయాలు అయ్యాయి.

కాగా, వర్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీ జోషి, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి జిల్లాకో ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. వాతావరణ శాఖ అధికారులతో టచ్ లో ఉండి, పరిస్థితికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

కాగా, కోస్తాంధ్రలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. రెండు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతంలో 55 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. 

  • Loading...

More Telugu News