puttaparthi: కల్మషం లేని ఆలోచనా విధానమే ఆధ్యాత్మికత: ‘సుప్రీం’ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా
- విచారణ నిష్పక్షపాతంగా చేసి తీర్పు వెలువరించాలి
- భవిష్యత్తు తరాలకు మనం దిక్సూచిలా వ్యవహరించాలి
- జాతీయ న్యాయ సదస్సులో జస్టిస్ దీపక్ మిశ్రా
దైవత్వమే మానవత్వం అని, కల్మషం లేని ఆలోచనా విధానమే ఆధ్యాత్మికత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న జాతీయ న్యాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘మానవ విలువలు - ప్రపంచ న్యాయం’ అంశంపై దీపక్ మిశ్రా మాట్లాడుతూ, న్యాయమూర్తి ఇచ్చే తీర్పు వల్ల ఒక వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా హరించుకు పోవచ్చని, విచారణ నిష్పక్షపాతంగా చేసి తీర్పు వెలువరించాలని సూచించారు. ‘భవిష్యత్తు తరాలు ఉన్నతంగా ఉండేందుకు మనం దిక్సూచిలా వ్యవహరించాలి. ఒక్క తీర్పు వల్ల స్వేచ్ఛ ప్రభావితం అవుతుంది.. వ్యక్తిత్వం ప్రభావితమవుతుంది.. నమ్మకం పోతుంది.. ఇదంతా ఒక్క తీర్పు వల్లే సంభవిస్తుంది. అందుకే, నిష్పక్షపాత విచారణతోనే తీర్పులు ఇవ్వాలి’ అని అన్నారు.
ఈ సందర్భంగా ‘ధర్మం’ గురించి ఆయన ప్రస్తావించారు. నేను మాత్రమే ప్రశాంతంగా ఉండాలనే భావన సరికాదు. ‘ధర్మం అనే భావనను ఏ భాషలోకి తర్జుమా చేయలేం... ‘ధర్మం’ సమాజాన్ని రక్షిస్తుంది. సామాజిక క్రమం కొనసాగేలా చూస్తుంది. మానవత్వాన్ని వృద్ధి చేయడంలో ‘ధర్మం కీలకపాత్ర పోషిస్తుంది..’ అని అన్నారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. రాధాకృష్ణన్, ఏపీ న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు.