america: అనుమతి లేకుండా విమానంతో గాల్లో మెకానిక్ షికార్లు.. అనుమానంతో వెంటాడిన యుద్ధ విమానాలు!

  • అమెరికాలోని వాషింగ్టన్ లో ఘటన
  • ఉగ్ర చర్య భయంతో వణికిపోయిన అధికారులు
  • చివరికి ఓ దీవిలో కుప్పకూలిన విమానం

అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాదాపు 17 ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడి తర్వాత చీమ చిటుక్కుమన్నా అమెరికా ఉలిక్కిపడుతోంది. తాజాగా వాషింగ్టన్ లో ఓ విమానం అనుమతి లేకుండా టేకాఫ్ కావడంతో మరోసారి అక్కడి అధికారులు గజగజ వణికిపోయారు. చివరికి ఓ మెకానిక్ ఈ పని చేశాడని తెలిసి విస్తుపోయారు.

వాషింగ్టన్ లోని సీటెల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన హోరైజాన్ ఎయిర్ క్యూ-400 విమానం స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా టేకాఫ్ అయింది. అనుమతులు లేకుండా విమానం వెళ్లడంపై వెంటనే ఏటీసీ సిబ్బంది ఎయిర్ ఫోర్స్ కు సమాచారం అందించారు. దీంతో రెండు ఎఫ్-15 యుద్ధ విమానాలు దీన్ని వెంబడించాయి.

ఈ విమానాన్ని ఇష్టానుసారంగా నడిపిన మెకానిక్.. సైకిల్ ను తిప్పినట్లు విమానాన్ని గాల్లో చిత్రవిచిత్రంగా తిప్పాడు. చివరికి విమానంపై నియంత్రణను కోల్పోయాడు. దీంతో విమానం వాషింగ్టన్ కు సమీపంలోని కెట్రాన్ దీవిలో కూలిపోయింది. ఈ ఘటనలో సదరు మెకానిక్ చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, 76 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని తమ సంస్థలో పనిచేసే మెకానిక్ టేకాఫ్ చేశాడని అలాస్కా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రదాడి జరిగి వచ్చే నెలకి 17 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ అనధికార టేకాఫ్ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. చివరికి ఇది ఉగ్ర చర్య కాదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సదరు మెకానిక్ ఆత్మహత్య చేసుకునేందుకే ఈ పనిచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.


  • Loading...

More Telugu News